మణుగూరు, అక్టోబర్ 27 (వై7 న్యూస్): ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోందని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చావ హనుమంతరావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60,000 విలువైన చెక్కును మంగళవారం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.







