ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులకు ఇది ముఖ్యమైన అప్‌డేట్. ఆ దేశ ప్రభుత్వం వీసా దరఖాస్తుల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. వీసా వ్యవస్థను మరింత సురక్షితంగా, పటిష్ఠంగా మార్చే లక్ష్యంతో భారత్‌లోని దరఖాస్తుదారులకు బయోమెట్రిక్ వివరాల సేకరణను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి (అక్టోబర్ 26) నుంచే అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ వేలిముద్రలతో పాటు ‘ఫేషియల్ ఇమేజ్’ కూడా అందించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా హైకమిషన్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్స్ అందించాల్సిన అవసరం ఉన్నవారికి ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తర్వాత వారు దేశవ్యాప్తంగా ఉన్న 16 వీఎఫ్ఎస్ గ్లోబల్ కేంద్రాల్లో ఒకదానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అర్హులైన కొందరు ‘ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్’ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు.
గుర్తింపు మోసాలను అరికట్టడం, చట్టబద్ధమైన దరఖాస్తుదారుల వివరాలకు భద్రత కల్పించడం, వలస వ్యవస్థ సమగ్రతను కాపాడటమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. బయోమెట్రిక్స్ సేకరణ వల్ల వీసా ప్రాసెసింగ్ సమయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని, అయితే దరఖాస్తుదారులు తమకు ఈ-మెయిల్ అందిన వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. అధికారిక లేఖ రాకుండా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవద్దని కూడా స్పష్టం చేసింది.
ఇప్పటికే దాదాపు 60 దేశాల్లో ఆస్ట్రేలియా ఈ బయోమెట్రిక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో భారత్‌ను కూడా చేర్చింది. దరఖాస్తుదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆస్ట్రేలియా, భారత చట్టాలకు అనుగుణంగా అత్యంత భద్రంగా, ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
ఆస్ట్రేలియాలో భారత సంతతి ప్రజలు రెండో అతిపెద్ద ప్రవాస సమాజంగా ఉండగా.. 2021 జనాభా లెక్కల ప్రకారం అక్కడ దాదాపు 9.76 లక్షల మంది భారత మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు. అలాగే, లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.








