భద్రాచలం:
పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఇసుక సిండికేట్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. చట్టాలను, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా గోదావరి ఇసుకను కొల్లగొడుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ యంత్రాంగం వేసిన ఎత్తులను సైతం మాఫియా చిత్తు చేస్తూ బరితెగించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ట్రెంచులను పూడ్చేసి.. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో దోపిడీ!
గోదావరి తీరం నుంచి అక్రమంగా ఇసుక తరలించకుండా నిరోధించేందుకు రెవెన్యూ సిబ్బంది భద్రాచలం గోదావరి ముందు భాగంలో రెండు భారీ కందకాలు (ట్రెంచులు) తవ్వించారు. అయితే, అధికారుల హెచ్చరికలను లెక్కచేయని ఇసుక దందారాయుళ్లు రాత్రికి రాత్రే ఆ ట్రెంచులను తిరిగి పూడ్చివేశారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లను రంగంలోకి దించి, గోదావరి నుంచి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు.
నిద్రలేని రాత్రులు.. కాలనీవాసుల భయాందోళన
అర్ధరాత్రి వేళల్లో మితిమీరిన వేగంతో, భీకర శబ్దాలతో దూసుకుపోతున్న ఇసుక ట్రాక్టర్ల కారణంగా పలు కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు, పోలీసులకు విన్నవించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఫోన్లు ఎత్తని అధికారులు.. మాఫియాతో కుమ్మక్కయ్యారా?
ఈ అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళల్లో గస్తీ తిరిగే పెట్రోలింగ్ సిబ్బందికి, స్థానిక పోలీస్ అధికారులకు కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, ఘటనా స్థలానికి రాకపోవడంపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన కొందరు యువజన నాయకుల అండదండలతోనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి ముట్టజెప్పాం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు” అని దందారాయుళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని, అందుకు తగ్గట్టే అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారని స్థానిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ప్రజా ఉద్యమం తప్పదు: సాధనపల్లి సతీష్ (సిపిఐ నాయకులు)
“భద్రాచలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరాయి. అధికారుల అండదండలు, అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలి. సామాన్య ప్రజలకు, స్థానికులకు ఇసుక కేవలం ₹1500 నుంచి ₹2000 ధరకే సులభంగా లభించేలా స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్ తక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను ఐక్యం చేసి దశలవారీగా భారీ ఉద్యమాలు చేపడతాం.”
— సాధనపల్లి సతీష్









