E-PAPER

యూరోపియన్ పార్లమెంట్‌లో ట్రంప్ బంగారు నగ్న విగ్రహం..! ట్రంప్ పై వ్యంగ్యంగా విగ్రహం..!

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. ‘ది ఆరెంజ్ ప్లేగ్’ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా బంగారు పూతతో మెరిసిపోతున్న ఈ శిల్పం, ట్రంప్‌పై ఒక వ్యంగ్యాస్త్రంగా నిలుస్తోంది.

డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ శిల్పి జెన్స్ గాల్‌షియోట్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. సుమారు 8.5 అడుగుల (2.6 మీటర్లు) ఎత్తు ఉన్న ఈ రాగి శిల్పానికి 23 క్యారెట్ల బంగారు పూత పూశారు. ఈ విగ్రహంలో ట్రంప్ నగ్నంగా, బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి భుజాలపై కూర్చుని ఉంటారు. 

ఆయన ఒక చేతిలో గోల్ఫ్ క్లబ్, మరో చేతిలో న్యాయదేవత పట్టుకునే త్రాసును పట్టుకుని కనిపిస్తారు. ఈ శిల్పాన్ని ‘కింగ్ ఆఫ్ ఇన్‌జస్టిస్’ (అన్యాయానికి రాజు) అని కూడా పిలుస్తున్నారు. ఈ విగ్రహం పీఠంపై ఒక ఆసక్తికరమైన సందేశం రాసి ఉంది. 

“నేను ఒక వ్యక్తి వీపుపై కూర్చున్నాను. నా బరువుతో అతను కుంగిపోతున్నాడు. అతనికి సహాయం చేయడానికి నేను ఏదైనా చేస్తాను.. కానీ అతని వీపు పైనుంచి దిగడం తప్ప” అనే వాక్యాలు ఈ శిల్పం ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ వ్యంగ్యాస్త్రమని శిల్పి గాల్‌షియోట్ వివరించారు.

డానిష్ ఎంఈపీ పెర్ క్లాసెన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక చిన్న ప్రదర్శనలో ఈ విగ్రహాన్ని ప్రధాన ఆకర్షణగా నిలిపారు. పార్లమెంట్‌లోని విన్‌స్టన్ చర్చిల్ భవనంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. సందర్శకుల కోసం ఈ విగ్రహం చిన్న ప్రతిరూపాలను కూడా పంపిణీ చేశారు. 

కొన్ని రోజుల ప్రదర్శన తర్వాత ఈ శిల్పాన్ని ఇక్కడి నుంచి తొలగించనున్నారు. కాగా, శిల్పి గాల్‌షియోట్ గతంలో కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి వివాదాస్పద కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!