E-PAPER

రీల్స్‌ చూస్తూ గంటలు గడుపుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా..?

“ఒక్క రీల్‌ చూసి ఫోన్‌ పక్కన పెట్టేస్తా..” అని అనుకుంటాం. కానీ ఆ ఒక్కటి కాస్తా మరో రీల్‌గా, ఇంకో వీడియోగా మారిపోతుంది. చూస్తుండగానే అరగంట, గంట గడిచిపోతుంది. ఇలా షార్ట్‌ వీడియోలు వరుసగా చూడటం వల్ల సమయం మాత్రమే పోతుందా? లేక మన మెదడుపైనా ప్రభావం పడుతుందా? తాజా పరిశోధన ఈ అంశంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఫోకస్‌కు సంబంధించిన మెదడు భాగాల్లో మార్పు
‘న్యూరోఇమేజ్‌’లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో 56 మంది యువతీ యువకులను పరిశీలించారు. వారు షార్ట్‌ వీడియోలు చూస్తున్నప్పుడు వారి మెదడు పనితీరును పరిశోధకులు ఎఫ్‌ఎంఆర్‌ఐ ద్వారా గమనించారు. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ల స్థాయిలను తెలుసుకునేందుకు ప్రోటాన్‌ మాగ్నెటిక్‌ రెసొనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీని కూడా ఉపయోగించారు.

ఈ పరిశోధనలో ప్రధానంగా డోర్సల్‌ యాంటీరియర్‌ సింగ్యులేట్‌ కార్టెక్స్‌ (డీఏసీసీ), డోర్సోలేటరల్‌ ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ (డీఐపీఎఫ్‌సీ) ప్రాంతాలపై దృష్టి పెట్టారు. మన దృష్టిని నియంత్రించడం, ప్రవర్తనను అదుపులో ఉంచడం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనుల్లో ఈ ప్రాంతాలు కీలకంగా ఉంటాయి.

నచ్చిన వీడియో చూస్తున్నప్పుడు..
పరిశోధనలో పాల్గొన్నవారికి వ్యక్తులు, పెంపుడు జంతువులు, ఆటలు, ప్రకృతి వంటి వివిధ అంశాలపై షార్ట్‌ వీడియోలు చూపించారు. ఎక్కువ వీడియోలు సుమారు 30 సెకన్ల నిడివితో ఉన్నాయి. నచ్చిన వీడియోను కొనసాగిస్తూ చూడొచ్చు.. నచ్చకపోతే వెంటనే మరో వీడియోకు వెళ్లొచ్చు.

వీడియో నచ్చి అందులో పూర్తిగా లీనమైన సమయంలో ఫోకస్‌, స్వీయ నియంత్రణ, నిర్ణయాలకు సంబంధించిన కొన్ని మెదడు ప్రాంతాల్లో యాక్టివిటీ తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

అంటే రీల్స్‌ మెదడును ‘ఆఫ్‌’ చేస్తున్నాయా?
అలా అనుకోవడం మాత్రం సరికాదు. ఈ అధ్యయనం రీల్స్‌ చూస్తే మెదడు మొత్తం పనిచేయడం ఆగిపోతుందని చెప్పలేదు. కొన్ని వీడియోలను ఆసక్తిగా చూస్తున్న సమయంలో మెదడులోని కొన్ని ప్రాంతాల యాక్టివిటీ తగ్గినట్లు మాత్రమే గుర్తించింది.

అంతేకాదు.. షార్ట్‌ వీడియోలు చూడటం వల్ల శాశ్వతంగా మెదడు దెబ్బతింటుందని లేదా దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుందని ఈ అధ్యయనం నిరూపించలేదు. కాబట్టి ఫలితాలను ఆ కోణంలో అర్థం చేసుకోకూడదు.

మరో అధ్యయనంలోనూ ఆసక్తికర ఫలితాలు

2025లో నికోలస్‌ బార్టన్‌, మైఖేల్‌ స్మిత్‌ నిర్వహించిన మరో అధ్యయనం షార్ట్‌ వీడియోల్లో తరచూ మారే అంశాల ప్రభావాన్ని పరిశీలించింది. వేగంగా ఒక వీడియో నుంచి మరో వీడియోకు మారడం వల్ల ప్రాస్పెక్టివ్‌ మెమరీపై ప్రభావం ఉండొచ్చని ఆ పరిశోధన సూచించింది. అంటే భవిష్యత్తులో చేయాల్సిన పనిని గుర్తుంచుకునే సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!