నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సినిమాపై వచ్చిన అన్ని రకాల స్పందనలను గమనించానని నాని తెలిపారు. ప్రేక్షకులు చూపించిన ప్రేమను స్వీకరించానని, అదే సమయంలో సరదాగా చేసిన ట్రోల్స్‌ను కూడా ఆస్వాదించానని పేర్కొన్నారు. సినిమాను తమ సొంత చిత్రంలా ఆదరించిన ప్రేక్షకుల తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అలాగే విమర్శకులు, రివ్యూవర్లు సినిమాలోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వెల్లడించారు.
‘ది ప్యారడైజ్’ కోసం చిత్రబృందం ఎంతో కష్టపడిందని నాని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ శ్రమించారని తెలిపారు. సినిమా ఇప్పుడు ప్రేక్షకుల సొంతమని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా లేదా విశ్లేషించాలా అనేది వారి ఇష్టమని పేర్కొన్నారు. సినిమాపై వస్తున్న ప్రశంసలు, విమర్శలను సమానంగా స్వీకరిస్తూ నాని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.









