భద్రాచలం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై వి. సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆగస్టు 23 రాత్రి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ సైని, ఉజ్వల్ సైనిగా గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అష్రఫ్ ఖురేషి అనే వ్యక్తి సూచనల మేరకు సుకుమ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకుని బెంగళూరులోని సతీష్ అనే వ్యక్తికి అప్పగించేందుకు బయలుదేరినట్లు వెల్లడించారు.
నిందితుల వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగులను తనిఖీ చేయగా 19 కేజీల గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.9.41 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ఎం. నాగరాజు, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.









