E-PAPER

Apple Watchతో తండ్రి ప్రాణాలకు రక్షణ.. కూతురు ఇచ్చిన గిఫ్ట్ చివరికి లైఫ్ సేవర్‌గా!

టెక్నాలజీ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడగలదని నిరూపించే ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు ప్రేమగా బహుమతిగా ఇచ్చిన Apple Watch.. మరణం అంచున ఉన్న మొహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తికి లైఫ్ సేవర్‌గా మారింది. ఒహాయోలోని సిన్సినాటిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఇస్లాం ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినప్పటికీ లేవలేని పరిస్థితిలో నేలపైనే ఉండిపోయారు.

అయితే ఆయన ధరించిన Apple Watchలోని Fall Detection ఫీచర్ వెంటనే స్పందించింది. ఇస్లాం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వాచ్ ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేయడంతో పాటు, ఎమర్జెన్సీ కాంటాక్టులకు కూడా సమాచారం పంపింది. దీంతో పారామెడిక్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇస్లాంను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను గుర్తు చేసుకున్న ఆయన.. తాను లేవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని, కొద్దిసేపటికే బయట అంబులెన్స్ సైరన్ వినిపించిందని స్థానిక మీడియాకు తెలిపారు.

ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఇస్లాం ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోవడం వల్లే ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సమస్యలు, నడవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నప్పటికీ అసలు కారణం తెలియలేదని ఇస్లాం తెలిపారు. కూతురు ఇచ్చిన Apple Watch తన ప్రాణాలను కాపాడిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన కుమార్తె కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అత్యవసర పరిస్థితుల్లో స్మార్ట్‌వాచ్‌లలోని భద్రతా ఫీచర్లు ఎంత కీలకంగా మారగలవో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News