మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల యువ క్రికెటర్ అదితి చౌఖాండే ఆత్మహత్యకు పాల్పడింది. బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఘటనా స్థలంలో పోలీసులు సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అకోలా స్వస్థలమైన అదితి గత రెండేళ్లుగా నాగ్‌పూర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో తల్లితో కలిసి నివసిస్తోంది. సుర్వే క్రికెట్ అకాడమీలో క్రమం తప్పకుండా శిక్షణ పొందుతూ, క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనేది. అయితే ఇటీవల విదర్భ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన సెలెక్షన్ ప్రక్రియలో ఆమెకు చోటు దక్కకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి తల్లితో కలిసి భోజనం చేసిన అనంతరం గదిలోకి వెళ్లిన అదితి.. గురువారం ఉదయం గదిలో విగతజీవిగా కనిపించింది.
ఘటనా స్థలంలో లభించిన సుసైడ్ నోట్‌లో “నాకు సెలెక్షన్ అవ్వలేదు” అని రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అదితి కుటుంబానికి కూడా క్రికెట్‌తో అనుబంధం ఉంది. ఆమె అన్నయ్య ప్రబల్ చౌఖాండే కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఈ ఘటనపై బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చేతన్ చౌహాన్ మాట్లాడుతూ.. జట్టుకు ఎంపిక కాకపోవడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా కనిపిస్తోందని తెలిపారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.









