తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య47’ చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ వార్త నిజమైతే, 2026లో సూర్యకు ఇది వరుసగా మూడో థియేట్రికల్ విడుదల అవుతుంది. ఇప్పటికే ‘కరుప్పు’తో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆగస్టు 14న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది నెలల్లోనే ‘సూర్య47’ కూడా థియేటర్లలోకి వస్తే, ఒకే ఏడాదిలో మూడు చిత్రాలతో అభిమానులను అలరించిన హీరోగా సూర్య ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు.
ఇక దీపావళి బాక్సాఫీస్ పోరు కూడా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో సిలంబరసన్ టి.ఆర్ నటిస్తున్న ‘అరసన్’ కూడా అదే సీజన్‌లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్న అంశంపై సినీ అభిమానుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.









