బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంక్షేమ సంఘం డిమాండ్
(వై7 న్యూస్)
భవన నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరో కార్మికుడు తీవ్ర ప్రమాదానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల క్రితం నిర్మాణ పనులకు వెళ్లిన తిరువీధుల దుర్గ ప్రసాద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు భవనం పైభాగం నుంచి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో ఆయన మెడ, వెన్నుముకకు సంబంధించిన నరాలు తీవ్రంగా దెబ్బతినగా, తలకు తీవ్ర గాయం కావడంతో సుమారు 12 కుట్లు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ అచేతన స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై దళిత సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికులకు కనీస భద్రతా పరికరాలు లేకుండానే పనులు చేయించారని ఆరోపించింది. నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? కార్మిక భద్రతా నిబంధనలు పాటించారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాలని కోరింది.
ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే బాధిత కార్మికుడికి మెరుగైన వైద్యం, తగిన నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది.
జిల్లాలో జరుగుతున్న అన్ని భవన నిర్మాణ పనుల్లో కార్మిక భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని దళిత సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వంతో పాటు యజమానుల బాధ్యత అని సంఘం పేర్కొంది.








