సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, 1960లో కుదిరిన 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో తిరిగి అమలు చేసే అవకాశం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భవిష్యత్తులో ఏ కొత్త ఒప్పందమైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికిన తర్వాతే సాధ్యమవుతుందని భారత్ తేల్చిచెప్పింది. సింధు జలాల పంపిణీకి సంబంధించిన నిబంధనలను యథాతథంగా కొనసాగించడం సాధ్యం కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందంలో మార్పులు అవసరమని భారత ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలో పాత విధానాన్ని కొనసాగించలేమని భారత్ పేర్కొంది. అయితే భారత్ ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగాలని ప్రస్తుతం కోరుకోవడం లేదని, కానీ ఒక సార్వభౌమ దేశంగా తన జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఒప్పందాన్నైనా పునఃసమీక్షించే హక్కు ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.








