E-PAPER

‘వారణాసి’పై భారీ అప్‌డేట్.. 20 నిమిషాల మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్‌తో రాజమౌళి సంచలనం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’పై ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఏకంగా 20 నిమిషాల నిడివి గల మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ ఉండనున్నట్లు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించాడు. హైదరాబాద్‌లోని అత్యాధునిక A&M MoCap స్టూడియోలో ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపాడు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు చూపిన అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పృథ్వీరాజ్ పేర్కొన్నాడు.

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. టైమ్-ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో రామాయణానికి సంబంధించిన సన్నివేశాలు, పృథ్వీరాజ్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర, అలాగే ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా నిలవనుంది. అంటార్కిటికా నేపథ్యంలో సన్నివేశాలు, భారీ యుద్ధ ఘట్టాలు కూడా చిత్రంలో ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలోని ప్రధాన ఐమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం ప్యాచ్‌వర్క్, డ్రామా భాగాల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News