పాల్వంచ | 22-11-2025
పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నాడు ‘మేర యువ భారత్ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలురు, బాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
బాలుర విభాగంలో కబడ్డీ, షటిల్ పోటీలు నిర్వహించగా, బాలికల విభాగంలో షటిల్, తాడు లాగుడు పోటీలు జరిగాయి. పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి షీల్డ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు సిల్వర్ మెడల్స్ సాధించి కళాశాలకు ఘనత తీసుకువచ్చారు.
క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను కళాశాల గౌరవ ప్రిన్సిపాల్ శ్రీ శంకర గారు ప్రధానం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కే. రవీంద్రబాబు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ పి. సుధాకర్, ఇతర స్టాఫ్ సభ్యులు కీలక పాత్ర పోషించారు.
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.









