కొత్తగూడెం
భద్రాద్రి జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎయిడ్ సంస్థ చేపట్టిన బాల్యవివాహాల నిర్మూలన కోసం వందరోజుల ప్రచార ఉద్యమ గోడపత్రికను ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు లేని తెలంగాణ సాధనలో భద్రాద్రి జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, అంగన్వాడీ-ఆశా కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని ఆయన సూచించారు.ఆడపిల్లల సర్వతోముఖాభివృద్ధికి బాల్యవివాహాలు పెద్ద అడ్డంకిగా మారకూడదని, ఎవరు బాల్యవివాహాలు చేయడానికి లేదా చేయించడానికి ప్రయత్నించినా చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. బాలల సమస్యలపై వెంటనే స్పందించేందుకు 24 గంటలు పనిచేసే చైల్డ్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలోని అన్ని బాలలుకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి బాలుడు సురక్షితమైన, ఆనందభరిత
వాతావరణంలో ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్, టీం సభ్యులు మాన్సింగ్, జ్యోతి, మోహన్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.









