E-PAPER

దారుణం..! చిన్నారి బాలుడిపై వీధి కుక్కల దాడి

ఎడమ కన్ను కోల్పోయిన రీత్విక్

నాగులపల్లి గ్రామంలో విషాదం

ఫరూఖ్‌నగర్ ;
ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జనార్ధన్–జ్యోతి దంపతుల కుమారుడు రీత్విక్ (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా, ఒక్కసారిగా వీధిలో సంచరిస్తున్న కుక్కల గుంపు అతనిపై దాడి చేసింది. చిన్నారి కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమికొట్టారు.

ఈ దాడిలో రీత్విక్ ఎడమ కన్నుకు తీవ్ర గాయమై, తల్లిదండ్రులు వెంటనే షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చిన్నారి ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. ఈ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

గ్రామస్థుల మాటల్లో — “ఇప్పటికే ఎన్నోసార్లు వీధి కుక్కల బెడద గురించి అధికారులకు తెలియజేశాం. కానీ చర్యలు తీసుకోలేదు. వేరే గ్రామాల నుండి కుక్కలను పట్టుకుని వచ్చి మా గ్రామంలో వదిలేస్తున్నారు. చిన్నపిల్లలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వీధి కుక్కల సంచారం పెరుగుతుండగా, అధికారులు ఇప్పటికైనా కదలిక చూపించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడిన ఈ ఘటన సంబంధిత శాఖల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News