E-PAPER

కోళ్లలో బర్డ్‌ఫ్లూ నివారణకు తొలి స్వదేశీ టీకా రెడీ…!

కోళ్లలో ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వైరస్‌ను అడ్డుకునేందుకు భారతదేశం చారిత్రక విజయాన్ని సాధించింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ హెచ్5ఎన్1 (క్లేడ్ 2.3.2.1ఎ) బర్డ్‌ఫ్లూ టీకాను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న జాతికి అంకితం చేయనున్నారు. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐసీఏఆర్-నిహ్సాడ్) శాస్త్రవేత్తలు ఈ ఇన్యాక్టివేటెడ్ టీకాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మన దేశంలో చెలరేగుతున్న క్లేడ్ 2.3.2.1ఎ రకం హెచ్5ఎన్1 వైరస్‌పై సమర్థవంతంగా పనిచేసే తొలి స్వదేశీ టీకా ఇదే కావడం విశేషం.

కోళ్ల పరిశ్రమను కుదిపేసే హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) బారిన పడ్డ పక్షుల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవిస్తాయి. వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు వేలాది కోళ్లను చంపాల్సి రావడంతో పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. 2006లో భారత్‌లో ఈ వ్యాధి తొలిసారి వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటివరకు హెచ్5ఎన్1, హెచ్5ఎన్8 రకాలకు సంబంధించి 500 కంటే ఎక్కువ వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయి. 2006 నాటి వ్యాప్తి వల్ల దేశంలో రూ.2,200 నుంచి రూ.3,000 కోట్ల మేర ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లింది. ఈ మహమ్మారి అదుపు తప్పితే దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయే ప్రమాదంతో పాటు 20 శాతానికి పైగా పౌల్ట్రీ రంగం ప్రమాదంలో పడుతుందని అంచనా.

ఇది కేవలం కోళ్లకే పరిమితం కాకుండా ప్రజారోగ్యానికి కూడా పెను ముప్పుగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు 25 దేశాల్లో 1,003 మానవ హెచ్5ఎన్1 కేసులు నమోదు కాగా, అందులో 479 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో నమోదయ్యే కేసుల్లో అత్యధికం క్లేడ్ 2.3.2.1ఎ రకం వల్లే వస్తున్నట్లు అధ్యయనాలు తేల్చాయి. ఇటీవల ఈ స్ట్రెయిన్ ఇతర జంతువులు, క్షీరదాలకు సైతం సోకుతుండటంతో పాటు ముగ్గురు మనుషుల్లోనూ కనిపించింది. ఇప్పటివరకు ఈ రకానికి మార్కెట్లో ప్రత్యేక వాణిజ్య టీకా అందుబాటులో లేదు. నిహ్సాడ్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ సరికొత్త వ్యాక్సిన్ రాకతో పౌల్ట్రీ రంగానికి భారీ ఊరట లభించనుంది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!