శ్రీకాకుళం జిల్లా, పలాస | నవంబర్ 18 | Y7 న్యూస్ తెలుగు
శ్రీకాకుళం జిల్లా మందస మేజర్ పంచాయతీలో రానున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేవరశెట్టి మార్కండేయులు విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని మాజీ శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీ పిలుపునిచ్చారు.

మందసలోని ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో గౌతు శ్యామసుందర శివాజీ ఆధ్వర్యంలో కూటమి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మందస పంచాయతీ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి దేవరశెట్టి మార్కండేయులుకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమిలో ఎలాంటి విభేదాలు, అపోహలకు తావులేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావాలని సూచించారు. మార్కండేయులును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో చర్చించారు. మందస పంచాయతీలో కూటమి నాయకుల మధ్య సమన్వయం, ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కోవాలనే అంశంపై నేతలు దృష్టి సారించారు.
ఈ సమావేశంలో మందస మండల పార్టీ అధ్యక్షుడు, స్థానిక కూటమి నాయకులు, మందస వైశ్య సంఘ నాయకులు, వ్యాపార ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








