E-PAPER

రాముడి తత్వం భారతీయతతో ముడిపడి ఉందన్న అక్తర్..!జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై మౌలానా రషీద్ ఆగ్రహం..

మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి రక్తంలో శ్రీరాముడు ఉన్నాడని ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావెద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘రామాయణ్’ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు కేవలం ఒక దేవుడు లేదా వ్యక్తి మాత్రమే కాదని, ఆయనొక ఆదర్శం, ఒక జీవన విధానమని అక్తర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 2004లో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమా కోసం తాను రాసిన ‘పల్ పల్ హై భారీ’ పాటను అక్తర్ గుర్తు చేసుకున్నారు. “మనసులో నుంచి రావణుడిని తీసివేస్తే, ఆ స్థానంలో రాముడు ఉంటాడు” అనే భావాన్ని ఆ పాటలో పొందుపరిచినట్లు వివరించారు. తన వ్యాఖ్యలపై కొందరికి కోపం రావచ్చని, కానీ రాముడి తత్వం భారతీయతతో ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బహిరంగ వేదికలపై తాను నాస్తికుడినని చెప్పుకునే వ్యక్తికి రాముడిపై ఇంత భక్తి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్‌లో తన పాటలు అమ్ముడుపోవాలనే అక్తర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాముడిపై అంత నమ్మకమే ఉంటే జావెద్ అక్తర్ తన పేరును ‘రామ్ పాల్’గా మార్చుకోవాలని రషీద్ ఎద్దేవా చేశారు.

మౌలానా చేసిన ఈ విమర్శలపై జావెద్ అక్తర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వాదోపవాదాలకు కారణమవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!