E-PAPER

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు.. ఆ కంటెంట్‌కు చెక్. !

సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన పాప్యులర్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యూజర్ల కోసం కీలక మార్పులు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ సిఫార్సుల (Recommendations) విధానాన్ని సవరించినట్లు, తద్వారా అశ్లీల, హింసాత్మక కంటెంట్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సలహాల నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ మార్పుల ప్రకారం, యూజర్లు ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులు వారి ఫీడ్‌లో కనిపించవు. అయితే, కంటెంట్‌పై పూర్తిస్థాయి నిషేధం కాకుండా కేవలం సిఫార్సుల నుంచి మాత్రమే వాటిని తొలగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా భారత్‌కు అనుగుణంగా అధునాతన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసినట్లు మెటా ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. యూజర్లు ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండానే ఈ ఏఐ వ్యవస్థలు అశ్లీల, హింసాత్మక కంటెంట్‌ను గుర్తించి, దాని వ్యాప్తిని అడ్డుకుంటాయని కంపెనీ వివరించింది.

ఈ కొత్త విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మెటా తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ప్రస్తుతం సిఫార్సు చేయబడిన కంటెంట్‌పై యూజర్లు చేసే ఫిర్యాదుల సంఖ్య దాదాపు సగానికి తగ్గిందని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించిన కచ్చితమైన గణాంకాలను మాత్రం వెల్లడించలేదు. యూజర్లు ఏదైనా పోస్టును ‘నాట్ ఇంట్రెస్టెడ్’ అని ఎంచుకున్నప్పుడు, ఆ ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి తమ సిఫార్సుల వ్యవస్థను మరింత మెరుగుపరుచుకుంటామని మెటా స్పష్టం చేసింది.

గత అక్టోబర్ 10న, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే, పక్షపాత ధోరణితో ఉండే కంటెంట్ వ్యాప్తి చెందకుండా చూడాలని, కంటెంట్ సిఫార్సుల విధానాన్ని సమీక్షించాలని సూచించింది. ప్రభుత్వ సూచనల తర్వాత ఇలా ఈ చర్యలు చేపట్టింది.

ఈ మార్పులతో పాటు తమ ఫీడ్‌లో ఎలాంటి కంటెంట్ చూడాలనే దానిపై యూజర్లకు మరిన్ని నియంత్రణలను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోంది. వీటిలో ‘సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్’, ‘పొలిటికల్ కంటెంట్ కంట్రోల్’, ‘హిడెన్ వర్డ్స్’, బ్లాకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లు తమకు నచ్చని కంటెంట్‌ను నియంత్రించుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!