*మూఢనమ్మకాల అనుమానంతో ఇద్దరు వృద్ధుల హత్య.. మరో ఇద్దరి ఆత్మహత్య.. ప్రజల్లో చైతన్యం కోసం మణుగూరు పోలీసుల కళాజాత
కరకగూడెం/మణుగూరు, y7 క్రైమ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల ఆదివాసీ గ్రామంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మాసయ్య, భీమయ్య అనే ఇద్దరు వృద్ధులు హత్యకు గురికావడం, ఆ ఘటన మరువకముందే మరో ఇద్దరు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంత్రాలు, చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వృద్ధుల హత్యకు సంబంధించి ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వృద్ధులు చేస్తున్న పూజలే తమ కుటుంబాల్లో మరణాలకు కారణమని భావించి కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, మాసయ్య అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులంతా గ్రామానికి చేరుకున్న సమయంలో మాసయ్య కుమారుడు రాంబాబు, కోడలు సునీత మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు మృతుడి బాబాయ్ రాంబాబు వెల్లడించారు. అయితే గొడవకు గల కారణాలు తమకు తెలియవని తెలిపారు. అన్న మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొందరు కుటుంబ సభ్యులు అదే రోజు సాయంత్రం మద్యం సేవించినట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం సుమారు 8:30 గంటలలోపు ఇద్దరు తన కళ్ల ముందే పురుగుల మందు తాగినట్లు వివరించారు. వెంటనే వారిని మణుగూరు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వరుస ఘటనలతో గ్రామంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మణుగూరు పోలీసులు ప్రత్యేక కళాజాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కళాజాత బృందం పాటలు, నాటికలు, ప్రదర్శనల ద్వారా మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించింది. మంత్రాలు, చేతబడులు వంటి అపోహలను నమ్మి ఇతరులపై అనుమానాలు పెంచుకోవడం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయాందోళనలకు గురికాకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అదేవిధంగా ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావని, కష్టసమయాల్లో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసుల సహాయం తీసుకోవాలని ప్రజలకు వివరించారు. ఒకవైపు మూఢనమ్మకాల ముసుగులో హత్యలు.. మరోవైపు వరుస ఆత్మహత్యలు.. బుడుగుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలు సమాజంలో అవగాహన, చైతన్యం ఎంత అవసరమో మరోసారి గుర్తుచేస్తున్నాయి. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, మూఢనమ్మకాలను తొలగించడం, ప్రజల్లో సామాజిక చైతన్యం పెంపొందించడమే కళాజాత కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. వరుస మరణాలకు సంబంధించిన పూర్తి కారణాలపై పోలీసుల విచారణ కొనసాగాల్సి ఉంది.








