పిల్లల ఆరోగ్యం కోసం నిర్వహించిన పూజల వ్యవహారంలో కుటుంబ కలహాలు.. పోలీసుల ప్రెస్ నోట్ విడుదల
మణుగూరు, వై సెవెన్ తెలుగు క్రైమ్ న్యూస్ ;
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడుగుల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలు, మనస్తాపంతో భార్యాభర్తలు వేర్వేరుగా గుర్తుతెలియని పురుగుల మందు తాగి మృతి చెందినట్లు మణుగూరు పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్లో వెల్లడించారు.
పోలీసుల ప్రెస్ నోట్ వివరాల ప్రకారం.. బుడుగుల గ్రామానికి చెందిన పద్దం చుక్కయ్య (40), తన తమ్ముడు పద్దం రాంబాబు, మరదలు పద్దం సునీత పిల్లల ఆరోగ్యం బాగుపడాలని భూసురాయికి చెందిన మడకం భీమయ్యను తీసుకువచ్చి పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం మడకం భీమయ్యతో పాటు తన తండ్రి పద్దం మాసయ్యను భూసురాయి వరకు దింపి రావడానికి పంపించినట్లు చుక్కయ్య తెలిపారు. అయితే మార్గమధ్యంలో బుడుగుల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తన తండ్రిని దాడి చేసి హత్య చేసి పూడ్చిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగినట్లు పోలీసుల ప్రెస్ నోట్లో వివరించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పద్దం సునీత ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగి మృతి చెందింది.
తన భార్య మరణానికి కుటుంబంలో జరిగిన గొడవలే కారణమని భావించిన పద్దం రాంబాబు కూడా మనస్తాపంతో ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగి మృతి చెందినట్లు చుక్కయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మరణాల విషయంలో తమకు ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని చుక్కయ్య పోలీసులకు తెలిపినట్లు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై పద్దం చుక్కయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వై సెవెన్ తెలుగు న్యూస్ | మణుగూరు








