బరువు తగ్గడానికి, మధుమేహ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్న ప్రముఖ ఔషధాలపై అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఓజెంపిక్, వెగోవీ వంటి మందుల వాడకం వల్ల అత్యంత అరుదైన కంటి సమస్య తలెత్తి, తీవ్రమైన లేదా శాశ్వత దృష్టి లోపం ఏర్పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గ్లూకగాన్-లైక్ పెప్టైడ్-1 (జీఎల్పీ-1) రిసెప్టర్ అగోనిస్ట్ తరగతికి చెందిన అన్ని ఔషధాల లేబుళ్లపై ఈ మేరకు ప్రత్యేక భద్రతా హెచ్చరికను తప్పనిసరిగా చేర్చాలని తయారీ సంస్థలను ఆదేశించింది.
ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో వినియోగించే ప్రముఖ ఔషధాలు ఈ కేటగిరీ పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రపంచ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న నోవో నార్డిస్క్ సంస్థకు చెందిన ‘ఓజెంపిక్’, ‘వెగోవీ’లతో పాటు ఎలీ లిల్లీ సంస్థ తయారు చేసే ‘మౌంజారో’, ‘జెప్‌బౌండ్’ వంటి పాపులర్ మందులు ఉన్నాయి. ఎఫ్‌డీఏ తాజా హెచ్చరిక ముఖ్యంగా ‘నాన్-ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి’ (నైయాన్ – NAION) అనే అరుదైన కంటి రుగ్మతకు సంబంధించింది. ఆప్టిక్ నాడికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల కంటిచూపు అకస్మాత్తుగా మందగించడమే కాకుండా, కొన్ని తీవ్రమైన కేసుల్లో శాశ్వతంగా చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
ఓజెంపిక్, వెగోవీలలో కీలక క్రియాశీల పదార్ధమైన ‘సెమాగ్లూటైడ్’ వినియోగానికి, ఈ కంటి సమస్యకు మధ్య సంబంధం ఉండే అవకాశం ఉందని 2024లో ప్రచురితమైన ఒక వైద్య పరిశోధన నివేదిక పేర్కొంది. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచే యూఎస్ ఎఫ్‌డీఏ ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ ప్రారంభించింది. సుమారు 125 క్లినికల్ ట్రయల్స్‌ను సమీక్షించిన అనంతరం, కనీసం ఏడాది పాటు జీఎల్పీ-1 ఔషధాలను ఉపయోగించిన ప్రతి 1,00,000 మంది రోగులలో దాదాపు ఆరుగురు ఈ నైయాన్ బారిన పడుతున్నారని గుర్తించారు. సాధారణ లేదా ఇతర గ్లూకోజ్ నివారణ చికిత్సలు తీసుకునే వారిలో ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య లక్ష మందికి నలుగురి కంటే తక్కువగా ఉంది.
ఈ కంటి సమస్య చాలా అరుదుగా వచ్చేదే అయినప్పటికీ, రోగులు మరియు వైద్యులు దీని తీవ్రతను గుర్తించాలని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. చూపు మసకబారడం, దృశ్యాలలో అంధత్వ మచ్చలు (బ్లైండ్ స్పాట్స్) ఏర్పడటం, రంగులు సరిగ్గా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది. ఈ ఔషధాలను వాడుతున్న సమయంలో కంటిచూపులో ఎలాంటి ఆకస్మిక మార్పులు గమనించినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయన్న ప్రచారంతో జీఎల్పీ-1 ఔషధాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే, వీటి వినియోగం పెరుగుతున్న కొద్దీ వీటికి సంబంధించిన దుష్ప్రభావాలు, ఆరోగ్యపరమైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థల నిఘా మరియు పర్యవేక్షణ కూడా మరింతగా పెరుగుతున్నాయి







