అలసటగా అనిపించినప్పుడు.. నిద్రమత్తు ఆవహించినప్పుడు.. వెంటనే ఉత్సాహం రావాలంటే చాలామంది ఎనర్జీ డ్రింక్స్ వైపు చూస్తుంటారు. ముఖ్యంగా యువతలో వీటి వినియోగం పెరుగుతోంది. వ్యాయామం చేసే ముందు, రాత్రిళ్లు మేల్కొని పనిచేసేటప్పుడు వీటిని తాగడం అలవాటుగా మారింది. అయితే తక్షణ ఉత్సాహాన్నిచ్చే ఈ పానీయాలు గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. వీటిలో ఉండే కెఫీన్ సహా ఇతర స్టిములెంట్స్ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచడంతో పాటు తీవ్రమైన గుండె సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
గుండె సమస్యలతో సంబంధం
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) భద్రతా డేటాబేస్‌లో 2017 నుంచి 2025 వరకు నమోదైన 28,345 నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో కెఫీన్ లేదా ఇతర స్టిములెంట్స్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్, సప్లిమెంట్లకు సంబంధించినవి 854 నివేదికలు ఉన్నాయి. స్టిములెంట్స్ లేని ఇతర ఉత్పత్తులతో పోలిస్తే వీటికి సంబంధించిన నివేదికల్లో గుండె ఆగిపోవడం గురించి ప్రస్తావన 11 రెట్లు, గుండెపోటు ప్రస్తావన 4.5 రెట్లు ఎక్కువగా ఉంది. గుండె లయలో అసాధారణ మార్పులు, గుండె దడ, గుండె వేగం పెరగడం, ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం వంటి సమస్యల ప్రస్తావన కూడా ఎక్కువగా కనిపించింది.
యువతలోనే ఎక్కువ ప్రస్తావన
ఈ నివేదికల్లో 18 నుంచి 34 ఏళ్ల వయసున్నవారికి సంబంధించినవి సుమారు 45 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలసట తగ్గించుకోవడానికి, వ్యాయామంలో శక్తి పెంచుకోవడానికి యువత ఎనర్జీ డ్రింక్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకుంటుండటం ఇందుకు ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కొందరు వ్యాయామానికి ముందు వీటిని తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ లేదా ఇతర డ్రింక్స్‌తో కలిపి తాగుతున్నారు.
గుండెపై ఎలా ప్రభావం చూపుతాయి?
ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. దీంతో నిద్రమత్తు తగ్గి అప్రమత్తత పెరుగుతుంది. అయితే అధిక మోతాదులో తీసుకుంటే గుండె వేగం, రక్తపోటు పెరగవచ్చు. గ్వారానా, టారిన్ వంటి ఇతర పదార్థాలు కూడా కొన్ని ఉత్పత్తుల్లో ఉంటాయి. ఇవి కెఫీన్‌తో కలిసినప్పుడు గుండెపై ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం సురక్షిత పరిమితిగా పరిగణిస్తారు. అయితే ఎనర్జీ డ్రింక్ ఒక్క డబ్బాలోనే 80 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉండొచ్చు. కాఫీ, టీ, ఇతర సప్లిమెంట్ల ద్వారా తీసుకునే కెఫీన్‌ను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
మోతాదుపై అప్రమత్తత అవసరం
ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్న తర్వాత గుండె దడ, ఛాతీ నొప్పి, తల తిరగడం, గుండె వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అధిక రక్తపోటు, గుండె లయ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉత్పత్తులపై ఉండే లేబుళ్లను పరిశీలించి కెఫీన్ మోతాదును తెలుసుకోవడం మంచిది.







