సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే కనిపించేది అలల హోరు మాత్రమే. కానీ ఆ నీలి నీటి పొరల కింద వేల మీటర్ల లోతులో ఓ అద్భుత ప్రపంచం దాగి ఉంది. అక్కడ వెలుతురు ఉండదు.. మనిషి ఊహించలేనంత ఒత్తిడి ఉంటుంది. అయినా ఆ చీకటి అగాధంలోనూ జీవులు మనుగడ సాగిస్తున్నాయి. అలాంటి అంతుచిక్కని సముద్ర గర్భంలోకి మనుషులను పంపేందుకు భారత్ ఓ సాహసోపేత ప్రయోగానికి సిద్ధమవుతోంది. అదే ‘మత్స్య-6000’.
ముగ్గురికి సురక్షిత ప్రయాణం
చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) ఈ జలాంతర్గామిని అభివృద్ధి చేస్తోంది. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న సముద్రయాన్ ప్రాజెక్టులో ఇది కీలక భాగం. 6,000 మీటర్ల లోతు వరకు ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లేలా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రయాణికుల కోసం 2.26 మీటర్ల వ్యాసంతో, 80 మిల్లీమీటర్ల మందంతో టైటానియం మిశ్రమ లోహంతో గోళాకార గదిని తయారు చేస్తున్నారు. సముద్ర గర్భంలో దాదాపు 600 బార్ల ఒత్తిడిని తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కీలక గది అభివృద్ధిలో ఇస్రో కూడా భాగస్వామిగా ఉంది.
ప్రాణరక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు
లోతైన సముద్రంలో ప్రయాణం అంటే కేవలం జలాంతర్గామిని కిందికి పంపడం మాత్రమే కాదు. లోపల ఉన్నవారికి నిరంతరం ఆక్సిజన్ అందించడం, బయట పరిస్థితులతో సమాచార సంబంధాలు కొనసాగించడం, దిశను గుర్తించడం, విద్యుత్ సరఫరా చేయడం వంటి అంశాలు అత్యంత కీలకం. అందుకే మత్స్య-6000లో జీవనాధార వ్యవస్థలు, నీటి అడుగున సమాచార వ్యవస్థ, నావిగేషన్, బ్యాటరీలు, అత్యవసర పరిస్థితుల్లో బయటపడే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
సాధారణంగా 12 గంటలపాటు పనిచేసేలా దీన్ని రూపొందించగా.. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు ప్రాణాలను కాపాడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులోని కట్టుపల్లి వద్ద నవంబర్ 6న మానవ రహిత పరీక్షలు నిర్వహించారు. 2028 నాటికి తొలి మానవ సహిత లోతైన సముద్ర యాత్ర చేపట్టాలన్నది భారత్ లక్ష్యం.
అగాధంలో దాగిన సంపద.. జీవ వైవిధ్యం
మత్స్య-6000 ప్రయాణం శాస్త్రవేత్తలకు సముద్ర గర్భాన్ని దగ్గరగా అధ్యయనం చేసే అవకాశం కల్పించనుంది. అక్కడ సూర్యరశ్మి లేకపోయినా కాంతిని వెలువరించే జీవులు ఉన్నాయి. సముద్రం అడుగున వేడి నీటిని విడుదల చేసే హైడ్రోథర్మల్ వెంట్ల సమీపంలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఇవి సూర్యరశ్మిపై కాకుండా రసాయన చర్యల ద్వారా లభించే శక్తితో జీవిస్తాయి.
మరోవైపు సముద్రపు అడుగున మాంగనీస్, నికెల్, కోబాల్ట్, రాగి వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, ఉక్కు, స్వచ్ఛ ఇంధన రంగాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ ప్రాంతాల్లో జీవుల మనుగడ, ఖనిజ నిక్షేపాల స్వభావం తెలుసుకోవడం భవిష్యత్తు పరిశోధనలకు కీలకం కానుంది. మంచుతో కప్పబడిన యూరోపా వంటి గ్రహాల ఉపగ్రహాల్లో జీవం ఉండే అవకాశాలపై అధ్యయనాలకూ ఈ పరిశోధనలు ఉపయోగపడవచ్చు.
అంతర్జాతీయ రేసులో భారత్
లోతైన సముద్ర పరిశోధనల్లో ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు ముందున్నాయి. అమెరికాకు ‘ఆల్విన్’, చైనాకు ‘ఫెందౌజే’, ఫ్రాన్స్‌కు ‘నాటిల్’ వంటి జలాంతర్గాములు ఉన్నాయి. చైనా జలాంతర్గామి 10 వేల మీటర్లకు మించిన లోతుకు వెళ్లగలదు. ఫ్రాన్స్ నాటిల్ 6 వేల మీటర్ల లోతు వరకు ప్రయాణించగలదు. భారత శాస్త్రవేత్తలు 2025 ఆగస్టులో అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రాన్స్ నాటిల్ ద్వారా 5 వేల మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశోధనల్లో పాల్గొన్నారు.
మరోవైపు మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ కూడా కొనసాగుతోంది. సముద్ర అడుగున ఖనిజాలను సేకరించే వ్యవస్థ కదలికలు, విద్యుత్ సామర్థ్యాలను 2021లో 5,270 మీటర్ల లోతులో పరీక్షించారు. నీటి అడుగున పర్వత శ్రేణుల సమీపంలోని హైడ్రోథర్మల్ సల్ఫైడ్ నిక్షేపాలపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్య-6000 విజయవంతమైతే లోతైన సముద్ర పరిశోధనల్లో భారత్ సామర్థ్యం మరింత పెరగనుంది.







