ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు ఊపందుకున్న వేళ, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తిపై విమర్శలు గుప్పించడం ఏమాత్రం సంస్కారం కాదంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు.
తన పోస్ట్‌లో సమాజ పోకడలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రేణూ దేశాయ్.. “ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా దూషించడం నైతికంగా సరైన విషయం కాదు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని ఇంకా తొక్కాలని చూడటం పూర్తిగా అమానుషం. సమాజంలో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా, చివరికి వాళ్లూ ఒక మనిషే అన్న సంగతి ఎవరూ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి సంతానంగానో, తల్లిదండ్రులుగానో లేదా తోబుట్టువుగానో ఉంటారు” అని గుర్తుచేశారు.
అలాగే ఇతరుల వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేసేవారికి ఆమె గట్టి చురకలు అంటించారు. “మనమే అసంపూర్ణమైన గాజు మేడల్లో నివసిస్తున్నప్పుడు, ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలి. మనమంతా మనుషులం. మనిషి అని పిలిపించుకోవడానికి సానుభూతి, దయ అనేవి ప్రాథమిక అవసరాలు” అని ఆమె హితవు పలికారు.
ఈ పోస్ట్‌ను ఆధారం చేసుకుని తనపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కూడా ఆమె ముందుగానే స్పష్టం చేశారు. “నేను ఈ మాటలు రాసినంత మాత్రాన మీ అర్థంలేని ఊహాగానాలు మొదలుపెట్టకండి. ఒక సమాజంగా మనం ఇంతకంటే మెరుగ్గా ఆలోచించగలమని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే, ఇలాంటి దయతో కూడిన, వివేకవంతమైన మాటలు మాట్లాడటానికి నాకేమీ పేటీఎం ద్వారా డబ్బులు అందలేదు. పనిచేసే మెదడు ఉన్న ఒక మనిషిగా పరిస్థితులను గ్రహించి మాత్రమే నేను స్పందిస్తున్నాను” అంటూ ఘాటు వ్యాఖ్యలతో తన పోస్ట్‌ను ముగించారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్, విమర్శలు వస్తున్న తరుణంలో రేణూ దేశాయ్ ఈ విధమైన పరిపక్వతతో కూడిన సందేశం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కష్టకాలంలో ఉన్నవారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆమె ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది.







