E-PAPER

భూమిపైకి జీవం అంతరిక్షం నుంచి రాలేదా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

అనంతమైన విశ్వంలో భూమి ఒక్కటే జీవం ఉన్న గ్రహమా? అసలు మన గ్రహంపై జీవం ఎలా పుట్టింది? కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపైకి దూసుకొచ్చిన తోకచుక్కలే జీవానికి అవసరమైన ముడి పదార్థాలను తీసుకొచ్చాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలకు తాజాగా ఓ పరిశోధన కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చింది. భూమిపై జీవం ఆవిర్భావానికి తోకచుక్కలే కారణమన్న దీర్ఘకాలిక సిద్ధాంతంపై సందేహాలు వ్యక్తం చేసింది. అంతేకాదు.. జీవానికి అవసరమైన రసాయనాలు భూమిపైనే ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడింది. మరి ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలు నమ్మిన సిద్ధాంతంలో ఉన్న లోపాలేంటి? కొత్త పరిశోధన చెబుతున్న విషయాలేంటి?

తోకచుక్కలే జీవానికి బీజం వేశాయా?
భూమిపై జీవం ఎలా మొదలైందన్నది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. అయితే ఒకప్పుడు భూమిపై జీవం ఆవిర్భావానికి అవసరమైన కార్బన్‌, నైట్రోజన్‌ వంటి మూలకాలు అంతరిక్షం నుంచి వచ్చి ఉండొచ్చని భావించారు. ముఖ్యంగా తోకచుక్కలు వీటిని భూమికి చేరవేసి ఉంటాయని ఓ సిద్ధాంతం ప్రతిపాదించింది. మంచు, ధూళి, కార్బన్‌ సమ్మేళనాలతో కూడిన ఈ ఖగోళ వస్తువులు ఆదిమ భూమిని ఢీకొన్నప్పుడు జీవానికి అవసరమైన సేంద్రియ అణువులు ఇక్కడికి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ భావననే జీవానికి అవసరమైన పదార్థాలు అంతరిక్షం నుంచి వచ్చాయనే సిద్ధాంతంలో భాగంగా చూస్తారు.

ఢీకొన్నప్పుడు ఏమవుతుంది?
అయితే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ వాదనను పరీక్షించారు. తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు వాటిలోని సున్నితమైన సేంద్రియ అణువులు సురక్షితంగా భూమిపైకి చేరగలవా? అన్నది పరిశీలించారు. ఈ క్రమంలో ఢీకొనే సమయంలో ఏర్పడే విపరీతమైన వేడి, పీడనంపై దృష్టి సారించారు. వాటి ప్రభావానికి లోనైతే జీవానికి అవసరమైన సున్నితమైన అణువులు నాశనమయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. అంటే తోకచుక్కలు మోసుకొచ్చిన పదార్థాలు భూమిపై జీవానికి బీజం వేయడం అంత సులభం కాదన్నమాట. ఈ పరిశోధన ఫలితాలు ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

అరుదైన పరిస్థితుల్లోనే సాధ్యం!
పరిశోధనకు నేతృత్వం వహించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ రిచర్డ్‌ ఆన్స్‌లో కీలక విషయాన్ని వెల్లడించారు. తోకచుక్కల ద్వారా జీవానికి అవసరమైన పదార్థాలు భూమికి చేరడం పూర్తిగా అసాధ్యమని చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఒకేసారి కలవాలని వివరించారు. తోకచుక్క సరైన వేగంతో, సరైన కోణంలో భూమిని ఢీకొనాలి. ఆ తర్వాత కూడా అవసరమైన రసాయనాలు తగిన మోతాదులో ఉండాలి. జీవం ఏర్పడేందుకు అనుకూలమైన రసాయన ప్రక్రియలు వేగంగా సాగాలి. ఇన్ని అంశాలు కలిసి రావడం చాలా అరుదని, పది లక్షల్లో ఒకసారి జరిగే ఘటనలా భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

గ్రహశకలాల పాత్రపై కొత్త ఆశలు
తోకచుక్కల సిద్ధాంతంపై సందేహాలు పెరగడంతో శాస్త్రవేత్తలు మరో అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అదే గ్రహశకలాలు (ఆస్టరాయిడ్లు). ఆదిమ భూమిపై ఇవి తోకచుక్కల కంటే ఎక్కువగా ఢీకొన్నాయి. అంతేకాదు.. వాటి ప్రభావం తోకచుక్కల ఢీకొట్టడాలతో పోలిస్తే తక్కువ విధ్వంసకరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల జీవానికి అవసరమైన కొన్ని రసాయన పదార్థాలను గ్రహశకలాలు భూమికి చేరవేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరో అవకాశం ఏంటంటే.. జీవానికి అవసరమైన రసాయన పదార్థాలు భూమిపైనే ఏర్పడి ఉండొచ్చు. 

అంగారకుడిపైనా ఇదే పరిస్థితా?
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపైనా దృష్టి సారించారు. అక్కడ కూడా తోకచుక్కల ఢీకొట్టడాల ద్వారా జీవానికి అవసరమైన పదార్థాలు చేరడం అంత సులభం కాదని అంచనా వేశారు. ఒకవేళ భూమిపై ఈ ప్రక్రియ జరగడం ఇంత అరుదైతే అంగారకుడిపై కూడా జరిగి ఉండే అవకాశాలు తక్కువేనని డాక్టర్‌ ఆన్స్‌లో పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!