‘రామాయణం’ సినిమాలోని పాటలపై వస్తున్న విమర్శలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించాడు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. ‘‘అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోండి’’ అని ఆయన అన్నట్లు తెలిపాడు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మంగళ్ రంగ్’ పాట ఇటీవల విడుదలైంది. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సంగీతం శైలిపై కొందరు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రెహమాన్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
తాను రూపొందించే సంగీతానికి మొదటి విమర్శకుడిని తానేనని రెహమాన్ చెప్పాడు. తాను సృష్టించిన ప్రతిదీ అద్భుతమని అనుకోనని, ఓ పాట రూపకల్పన వెనుక నెలల తరబడి ఆలోచన, కృషి ఉంటాయని వివరించాడు. ఏదైనా ఒక నిర్ణయానికి ఒక్క రోజులో రాలేమని అన్నాడు. కొన్ని పాటలు పచ్చడిలా కాలం గడిచేకొద్దీ మరింత నచ్చుతాయని అభిప్రాయపడ్డాడు. పాటలోని ఒక్క అంశాన్ని మాత్రమే చూసి నిర్ణయానికి రావద్దని సూచించాడు.
ఈ సినిమా సంగీతం కోసం భారీ స్థాయిలో పని చేస్తున్నట్లు రెహమాన్ తెలిపాడు. భారతీయ వెర్షన్‌తో పాటు హాలీవుడ్ వెర్షన్ కోసం కూడా సంగీతం రూపొందిస్తున్నామని చెప్పాడు. ఐదు భాషల్లో ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించాడు.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం 2026 నవంబర్ 5న, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది.








