రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిన్న ‘ఇండియా’ కూటమి నిర్వహించిన ర్యాలీ కారణంగా తమకు రూ.11,000 కోట్ల మేర భారీ వ్యాపార నష్టం వాటిల్లిందని ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆరోపించాయి. పండుగల సీజన్లో ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది.
సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ… నిన్న జరిగిన ర్యాలీ వల్ల ఢిల్లీకి ప్రత్యక్షంగా రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇందులో రిటైల్, హోల్సేల్ వ్యాపారం ద్వారా రూ.8,800 కోట్లు, రవాణా, లాజిస్టిక్స్ రంగంలో రూ.1,500 కోట్లు, హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో రూ.500 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. రామ్లీలా మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిలోని చాందినీ చౌక్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సదర్ బజార్ వంటి ప్రధాన మార్కెట్లలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయని సీటీఐ పేర్కొంది. దీనివల్ల దాదాపు 20 లక్షల మంది రోజువారీ కార్మికులు, వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారని, వారికి రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ ప్రభుత్వమే బలవంతంగా దుకాణాలను మూయించిందని ఆయన ఆరోపించారు. ర్యాలీకి వచ్చిన వారు స్థానిక వ్యాపారులకు మద్దతుగా షాపింగ్ చేయాలని తాము కోరామని, కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని దుకాణాలను మూయించేసిందని ఒక వీడియోలో విమర్శించారు.








