E-PAPER

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏంటో తెలుసా..?

పాకిస్థాన్‌లోని లాహోర్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య నమోదైన గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 530కి చేరింది. గాలిలో అత్యంత సూక్ష్మమైన పీఎం2.5 కాలుష్య కణాల సాంద్రత క్యూబిక్‌ మీటరుకు 343 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఐక్యూఎయిర్‌ ప్రపంచ నగరాల కాలుష్య ర్యాంకింగ్స్‌లో లాహోర్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ జాబితాలో ఈజిప్టు రాజధాని కైరో 226 ఏక్యూఐతో రెండో స్థానంలో ఉంది.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ నగరాల్లోనూ వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. లాహోర్‌ తర్వాత గుజ్రన్‌వాలా 475, ఫైసలాబాద్‌ 435, ముల్తాన్‌ 280, సియాల్‌కోట్‌ 241 ఏక్యూఐతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బహావల్‌పూర్‌ 180 ఏక్యూఐతో ఏడో స్థానంలో ఉంది. ప్రావిన్స్‌లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే ఘటనలు పెరగడంతో గాలి నాణ్యత మరింత దిగజారుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయం సగటున 3.9 ఏళ్లు తగ్గుతోందని పాకిస్థాన్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇనిషియేటివ్‌ నివేదిక వెల్లడించింది. ఏటా సుమారు 1.28 లక్షల మంది అకాల మరణాలకు కాలుష్యం కారణమవుతోందని అంచనా వేసింది. కాలుష్యం వల్ల దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.5 శాతానికి సమానమైన ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. లాహోర్‌లో కాలుష్యానికి ఎక్కువకాలం గురైతే ఆయుర్దాయం ఏడేళ్ల వరకు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

‘పాకిస్థాన్‌ వాయు కాలుష్యాన్ని ఆవిష్కరిస్తూ.. ఆరోగ్య ప్రమాదాలు, కారణాలు, పరిష్కారాలపై జాతీయ నివేదిక’ పేరుతో రూపొందించిన అధ్యయనం కరాచీ, ఇస్లామాబాద్‌, రావల్పిండి, లాహోర్‌, పెషావర్‌ నగరాల్లో కాలుష్య పరిస్థితులను విశ్లేషించింది. లాహోర్‌లో పీఎం2.5 కాలుష్యానికి ప్రధాన కారణం రవాణా రంగమని నివేదిక పేర్కొంది. పరిశ్రమల వాటా 28 శాతం, ఇటుక బట్టీల వాటా 17 శాతంగా ఉన్నట్లు తెలిపింది. శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు కాలుష్య తీవ్రతను మరింత పెంచుతున్నాయని వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన వార్షిక పీఎం2.5 పరిమితి క్యూబిక్‌ మీటరుకు 5 మైక్రోగ్రాములు కాగా, లాహోర్‌లో వార్షిక సగటు స్థాయి 110 మైక్రోగ్రాములకు మించి నమోదవుతోంది. అంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితికి 22 రెట్లకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!