దేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదకరమైన ధోరణిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక లేఖ రాసింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొన్నేళ్లుగా ఉత్తరాఖండ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోందని ఎఫ్ఐపీ తన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యాచరణ విధానాలు, పైలట్లకు శిక్షణ, వాతావరణ అంచనాలు, హెలిప్యాడ్ల మౌలిక సదుపాయాలు, భద్రతా నిర్వహణ వ్యవస్థల పనితీరుపై ఈ ప్రమాదాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని హెలికాప్టర్ కార్యకలాపాలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ సమగ్ర సమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పింది. చార్‌ధామ్ యాత్రలో జరుగుతున్న ప్రమాదాలపై 2025 ఆగస్టులో పార్లమెంటరీ కమిటీ కూడా తన 380వ నివేదికలో హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది.
కేదార్‌నాథ్ సెక్టార్‌లోని భూభాగం పూర్తిగా పర్వతాలు, ఇరుకైన లోయలతో నిండి ఉందని, డీజీసీఏ నిబంధనల ప్రకారం ఇది అత్యంత ‘ప్రతికూల వాతావరణ’ ప్రాంతమని ఎఫ్ఐపీ వివరించింది. ఇక్కడ ఇంజిన్ ఫెయిల్ అయితే సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి అవకాశం ఉండదని తెలిపింది. చాలా హెలిప్యాడ్లు ఏకదిశ టేకాఫ్/ల్యాండింగ్ విధానాన్ని కలిగి ఉండటం వల్ల, గాలికి వ్యతిరేక దిశలో కాకుండా దాని ప్రవాహ దిశలోనే (టేల్‌విండ్) టేకాఫ్ చేయాల్సి వస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.
చార్‌ధామ్ యాత్రలో ఉపయోగిస్తున్న హెలికాప్టర్లన్నీ సింగిల్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ క్లాస్ 3 రకానికి చెందినవని, వీటికి ఆటోపైలట్, వెదర్ రాడార్ వంటి కీలక సదుపాయాలు లేవని ఎఫ్ఐపీ పేర్కొంది. ఈ తరహా హెలికాప్టర్లలో ఇంజిన్ విఫలమైతే బలవంతంగా కిందకు దించాల్సి (ఫోర్స్డ్ ల్యాండింగ్) ఉంటుంది. కానీ, ప్రతికూల వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో సురక్షిత ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలు లేనందున, ఇక్కడ ఈ హెలికాప్టర్ల వినియోగం ఎంతమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేసింది. సాధారణ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్ ఆపరేషన్లలో నష్టభయం ఎక్కువని, ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేసింది.








