మన శరీరంలో గుండె రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తూ అన్ని అవయవాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. అయితే కాళ్ల నుంచి రక్తం తిరిగి గుండెకు చేరడంలో మరో వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అదే కాలి వెనుక భాగంలో ఉండే పిక్క కండరాలు (కాఫ్ మజిల్స్). వీటిని వైద్య పరిభాషలో శరీరానికి ‘రెండో గుండె’గా అభివర్ణిస్తారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. గుండె చేసే పనిని ఇవి పూర్తిగా చేయలేకపోయినా, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు ఎంతో సహాయపడతాయి.
రెండో గుండెగా ఎందుకు పిలుస్తారు?
గుండె నుంచి రక్తం ధమనుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. అక్కడ ఆక్సిజన్‌ను అందించిన తర్వాత సిరల ద్వారా తిరిగి గుండెకు చేరాలి. అయితే కాళ్లలోని రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిక్క కండరాలు సహజమైన పంపులా పనిచేస్తాయి. మనం నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు లేదా పాదాలను కదిలించినప్పుడు ఈ కండరాలు సంకోచించి, వాటి మధ్య ఉన్న లోతైన సిరలపై ఒత్తిడి కలిగిస్తాయి. దీంతో రక్తం పైకి, గుండె వైపు కదులుతుంది. సిరల్లో ఉండే ఏకమార్గ కవాటాలు రక్తం తిరిగి కిందికి ప్రవహించకుండా అడ్డుకుంటాయి. ఈ రెండు వ్యవస్థలు కలిసి రక్త ప్రసరణకు తోడ్పడతాయి.
ఎక్కువసేపు కదలకుండా ఉంటే ఏమవుతుంది?
ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోవడం, సుదీర్ఘ ప్రయాణాలు చేయడం, ఎక్కువసేపు కాళ్లు కదపకుండా ఉండటం వల్ల పిక్క కండరాల పంపింగ్ చర్య తగ్గుతుంది. దీంతో కాళ్లలో రక్తం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా పాదాలు, చీలమండల వాపు, కాళ్లలో బరువుగా అనిపించడం, అలసట, కండరాల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంలో వెరికోస్ వెయిన్స్, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ వంటి సిరల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువసేపు కదలకుండా ఉండటం రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పిక్క కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..
ప్రతిరోజూ నడకకు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. వీలైతే రోజుకు 30 నిమిషాల పాటు నడవాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవాలి. పాదాలను పైకి, కిందికి కదపడం, చీలమండలను గుండ్రంగా తిప్పడం, మడమలను పైకి లేపి కిందికి దించడం వంటి చిన్న వ్యాయామాలు చేయవచ్చు. మెట్లు ఎక్కడం కూడా పిక్క కండరాలు చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కూడా మంచిది.
కాళ్లలో నిరంతర వాపు, ఒక కాలిలో అకస్మాత్తుగా నొప్పి, ఎర్రబడటం లేదా వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ఇవి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి వస్తే అత్యవసర వైద్య సహాయం పొందాలి. కాబట్టి గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లే పిక్క కండరాల చురుకుదనంపైనా దృష్టి పెట్టాలి.







