సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వేడుకలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా వీరి వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐవరీ, లేత నీలం రంగుల కలయికతో బరోక్ శైలిలో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆహ్వాన పత్రికను అందమైన పెట్టెలో రూపొందించారు. దానిపై లేత నీలం రంగు డిజైన్లు, బంగారు రంగు అలంకరణలు ఉన్నాయి. ఎంబాస్ చేసిన పత్రాలు, పాతకాలపు శైలిని గుర్తు చేసే ముద్రలు ఈ డిజైన్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ ఆహ్వాన పత్రికను రూపొందించిన పింక్ విసిల్ మ్యాన్ సంస్థకు చెందిన రంజని అయ్యంగార్ సోషల్ మీడియాలో ఈ డిజైన్ తయారీలో భాగం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అనిరుధ్, కావ్యల వివాహ వేడుకలు గ్రీస్‌లో సన్నిహిత కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు వేడుకలు జరిగే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. అయితే వివాహ తేదీ, వేదికపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివాహ రిసెప్షన్ మాత్రం నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావ్య తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్ కలిసి ఆహ్వానించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అనిరుధ్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. కావ్య మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనూ ఆమెకు అనుబంధం ఉంది.








