E-PAPER

ఇక మీ ఫోన్‌లో మీరే యాప్‌ క్రియేటర్‌..! ప్లే స్టోర్‌లో గూగుల్ అదిరిపోయే మార్పులు..!

గూగుల్ ప్లే స్టోర్‌లో కీలక మార్పులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఎవరికి కావాల్సిన ఆండ్రాయిడ్ యాప్‌లను వారే రూపొందించుకునే సదుపాయాన్ని గూగుల్ తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా డెవలపర్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు. సాధారణ అకౌంట్‌తోనే ఏఐ టూల్స్‌, సహజ భాషలో ఇచ్చే సూచనల ద్వారా యాప్‌లను తయారు చేసి సొంత ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు. మంగళవారం ఈ కొత్త ఫీచర్లను గూగుల్ ప్రకటించింది.

గూగుల్ ఏఐ స్టూడియో సాయంతో రూపొందించే ఈ యాప్‌లను ప్రస్తుతానికి సొంత పరికరాల్లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఇవి ప్లే స్టోర్‌లో అందరికీ కనిపించే యాప్‌లకు వేరుగా ఉంటాయి. త్వరలో స్నేహితులు, కుటుంబ సభ్యులతోనూ వీటిని పంచుకునే అవకాశం కల్పించనుంది. పబ్లిక్‌గా యాప్‌లను విడుదల చేయాలనుకునేవారు మాత్రం ప్రొఫెషనల్ డెవలపర్ అకౌంట్ తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణ యాప్‌ల తరహాలోనే భద్రతా తనిఖీలు, నాణ్యతా పరీక్షలు పూర్తిచేయాలి. ఈ సదుపాయం అమెరికా సహా కొన్ని ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడినవారికి దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.

యాప్‌ల ఎంపికను సులభతరం చేసేందుకు గూగుల్ ఏఐ ఆధారిత టూల్స్‌ను కూడా తీసుకొస్తోంది. ‘ఆస్క్‌ ప్లే’ ద్వారా యాప్‌లను పోల్చి, వాటి మధ్య తేడాలను తెలుసుకోవచ్చు. యూజర్ల అభిప్రాయాలనూ పరిశీలించవచ్చు. ‘ప్లే ఇన్‌ జెమినీ’ ఫీచర్‌తో గూగుల్ ప్లేలోని యాప్‌లు, గేమ్స్‌, డెవలపర్ల కంటెంట్‌ను జెమినీ సంభాషణల్లోనే తెలుసుకోవచ్చు.

గేమ్స్‌ కోసం ‘గేమ్‌ ఫైండర్‌ను’ను అందుబాటులోకి తెస్తోంది. యూజర్ల అభిరుచులు, ఆటతీరును విశ్లేషించే ‘గేమర్‌ డీఎన్‌ఏ’ ఆధారంగా గేమ్స్‌ను సిఫార్సు చేస్తుంది. గేమ్స్‌ను సొంతంగా జాబితాలుగా రూపొందించుకునేందుకు ‘గేమ్‌ ప్లేలిస్ట్స్‌’ సదుపాయమూ ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో ఇంగ్లిష్‌లో అందుబాటులోకి వస్తోంది.

ఇవే కాకుండా ఇద్దరి నుంచి ఐదుగురు కలిసి పాల్గొనే 48 గంటల గేమింగ్ ఛాలెంజ్‌లు, గేమ్‌లో 30 సెకన్ల ఆట దృశ్యాలను రికార్డు చేసే సదుపాయాన్ని కూడా గూగుల్ ప్రకటించింది. కార్లలోని గూగుల్ వ్యవస్థలు, ఎక్స్‌ఆర్ పరికరాల్లో ప్లే స్టోర్ అనుభవాన్ని మెరుగుపరుస్తోంది. పీసీ గేమింగ్ కేటలాగ్‌లోనూ కొత్త గేమ్స్‌ను చేర్చుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!