ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్
ఏటపాక,( వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆశా వర్కర్లు భర్తీ నోటిఫికేషన్ భాగంగా.. షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHC) ఖాళీగా ఉన్న ఆశా (ASHA) వర్కర్ల పోస్టుల నియామకాలన్నీ 100 శాతం స్థానిక ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఆదివారం ఏటపాక మండల కేంద్రం నుండి ఆయన పత్రిక పరంగా ప్రకటన విడుదల చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లోని వైద్య పరిరక్షణకు, ఆదివాసీ ప్రజలకు సేవలు అందించడానికి ఉద్దేశించిన ఈ ఆశా వర్కర్ల నియామకాలకు సంబంధించి నాన్-ట్రైబల్స్ (ఆదివాసేతరులు) కూడా దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా జీఓ ఎంఎస్ నంబర్ 68 (G.O.Ms.No. 68) మరియు ఏజెన్సీ చట్టాల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలోని పోస్టుల నియామకాలు 100 శాతం స్థానిక ఆదివాసులకే కేటాయించాల్సి ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా గుర్తేడు, పెద్దగడ్డ, వన్ నరసాపురం, జడ్డంగి, రాజవోమంగి, మారేడుమిల్లి, బోదులూరు, ఇండుకూరుపేట, ఎల్లవరం, నెల్లిపాక (చింతూరు డివిజన్), తులసి పాక, ఏడుగురాళ్లపల్లి తదితర పీహెచ్సీల పరిధిలోని ఆదివాసి గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయని గుర్తుచేశారు. రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఆదివాసేతరులకు అవకాశం కల్పిస్తే స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రత్యేక చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి, దరఖాస్తు చేసుకున్న స్థానిక ఆదివాసీ మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ నియామకాలను పూర్తి చేయాలని కుంజా శ్రీను ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.








