ఆల్కహాల్‌ను తక్కువ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీర్ కంపెనీలు ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్, తక్కువ క్యాలరీలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటిలో ఆల్కహాల్ ఉంటే వాటిని ఆరోగ్యకరమైన పానీయాలుగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద బీర్ కంపెనీల్లో ఒకటైన ఇన్‌బెవ్ ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్ కలిగిన బీర్‌లతో పాటు చిన్న ప్యాక్‌లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. బ్రెజిల్‌లో ఇప్పటికే ‘స్పాటెన్’ పేరుతో ప్రోటీన్ కలిగిన బీర్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు సమాచారం. ఆరోగ్యంపై వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు తమ ఉత్పత్తుల్లో కొత్త మార్పులు చేస్తున్నాయి.
ఆల్కహాల్ లేని బీర్‌లలోనూ ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్‌ను జోడించే దిశగా ఇన్‌బెవ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే బాటిల్‌పై ‘ప్రోటీన్’, ‘ఎలక్ట్రోలైట్స్’, ‘తక్కువ క్యాలరీలు’ వంటి పదాలు ఉన్నంత మాత్రాన ఆల్కహాల్ కలిగిన పానీయం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించకూడదు. ముఖ్యంగా ఫిట్‌నెస్ పేరుతో ఇలాంటి ఉత్పత్తులను ప్రచారం చేసే ప్రకటనలను వినియోగదారులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.








