భద్రాచలం, సెప్టెంబర్ 20 (Y7 న్యూస్ తెలుగు): ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 21న భద్రాచలంలో ఆదివాసీ మార్చ్, ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయకులు తెలిపారు.

భద్రాచలం అల్లూరి సీతారామరాజు కాలనీలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో భద్రాచలం ఆదివాసీ సమితి (BAS), ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి పెద్దలు తాటి రుక్మిణి, సోడే సావిత్రి, జారే భద్రమ్మ, యాప బుజ్జమ్మ ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుంచి PO ITDA కార్యాలయం వరకు ఆదివాసీ మార్చ్, ర్యాలీ నిర్వహించి అనంతరం ITDA కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
1/70 చట్టం, PESA చట్టం, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, అటవీ హక్కుల చట్టం–2006 సమర్థవంతంగా అమలు చేయాలని, ఆదివాసీల భూమి–అటవీ హక్కులను పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన ITDAలను మరింత పటిష్టపరచాలని, ITDA పరిధిలోని ఉద్యోగాలను ITDA ద్వారానే భర్తీ చేయాలని కోరారు. విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 21న జరిగే ఆదివాసీ మార్చ్, ధర్నాలో ఆదివాసీ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొండ్రు సుధారాణి, కుంజా సంతోష్, కొర్సా చినబాబు దొర, వీసాల కృష్ణయ్య, కణితి రాధ, వీసాల ఉమాదేవి, మిడియం నాగమణి, శీలం దుర్గ, కెచ్చెల భవానీ, శీలం రాజారావు, సోయం మంగవేణి, ఉయిక వెంకటలక్ష్మి, సవలం రాధ, సవలం దుర్గ, అట్టం కమల తదితరులు పాల్గొన్నారు.








