E-PAPER

పోలవరం జిల్లాలో 19 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పోలవరం, (వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 19: పోలవరం జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న 19 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు ఉన్న గ్రామాల్లో నివసించే అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మెడికల్ ఆఫీసర్‌కు స్వయంగా అందజేసి రశీదు పొందాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.

అభ్యర్థులు తప్పనిసరిగా మహిళలై ఉండటంతో పాటు సంబంధిత గ్రామంలో నివసిస్తూ 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, తెలుగు భాషను స్పష్టంగా చదవడం, రాయడం వచ్చి ఉండాలని పేర్కొన్నారు.

వితంతువులు, విడాకులు పొందినవారు, భర్త నుంచి విడిపోయినవారు, నిరాశ్రయ మహిళలు, మైనర్ పిల్లలతో ఉన్న ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆరోగ్యం, పరిశుభ్రత, సంక్షేమ కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ అంశాలపై అవగాహన ఉండటంతో పాటు ప్రజలకు వివరించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కారంలో చొరవ వంటి నైపుణ్యాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

దరఖాస్తుతో పాటు పదో తరగతి మార్కుల మెమో, తహశీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఓటరు గుర్తింపు కార్డు ప్రతులను జత చేయాలని అధికారులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!