గూగుల్ అత్యంత శక్తివంతమైన AI మోడల్ జెమిని సైబర్ సెక్యూరిటీ పరీక్షా సమయంలో తన పరిధిని దాటి మూడు కంపెనీలను హ్యాక్ చేసింది. ఒక AI మోడల్ పరీక్షా వాతావరణం (Sandbox) నుంచి బయటకు వచ్చి, నిజ ప్రపంచంలోని కంపెనీలను యాక్సెస్ చేయడం గూగుల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఘటనను గూగుల్ స్వయంగా ధృవీకరించింది.
జెమినికి సంబంధించిన ఈ తొలి హ్యాకింగ్ ఘటన 2026 మే నెలలో జరిగిందని పేర్కొంటూ దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ సెప్టెంబర్ 18, 2026 శుక్రవారం నాడు ఓ కథనం ప్రచురించింది.
ఈ పరీక్షను ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఇర్రెగ్యులర్’ నిర్వహించింది. టెస్టింగ్ సిస్టమ్‌లో ఉన్న ఒక సాంకేతిక లోపం వల్ల జెమినికి అనుకోకుండా ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది. దీంతో అది తనకు అప్పగించిన టాస్క్‌ను వదిలేసి, బయట ఉన్న నిజమైన కంపెనీల సిస్టమ్‌లలోకి చొరబడింది.
ఒక కంపెనీలో పాస్‌వర్డ్‌లను ఊహించడం (Brute-force) ద్వారా, మరో రెండు కంపెనీల్లో పబ్లిక్ కోడ్‌లో బహిరంగంగా ఉన్న లాగిన్ వివరాలను ఉపయోగించి జెమిని హ్యాక్ చేసింది. అయితే, తాను హ్యాక్ చేసింది నిజమైన కంపెనీ అని గుర్తించిన వెంటనే జెమిని తనంతట తానే ఆగిపోయిందని, ఎలాంటి హాని చేయలేదని గూగుల్ తెలిపింది.
ఈ ఉల్లంఘన ఎలా జరిగింది?: పరీక్షా సమయంలో జెమినికి ఒక ఊహాత్మక కంపెనీ నుంచి సమాచారం సేకరించే టాస్క్ ఇచ్చారు. కానీ ఆ మోడల్ తనకు కేటాయించిన శాండ్బాక్స్ను దాటి, అనధికారికంగా ఇంటర్నెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత, ఆ AI మోడల్ ఒక పాస్‌వర్డ్‌ను ఊహించి, ఒక నిజమైన కంపెనీ సర్వీస్‌లోకి చొరబడింది.
ఈ ఘటనపై గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన హీథర్ అడ్కిన్స్, అల్ జజీరాకు చెందిన జాన్ హెండ్రెన్తో మాట్లాడుతూ.. “మిగిలిన రెండు సందర్భాలలో, ఆ మోడల్ ఆన్లైన్లో బహిరంగ సమాచారాన్ని గుర్తించి, అది పరీక్షలో భాగమే అనుకుని ఆ వెబ్సైట్లలోకి ప్రవేశించడానికి క్రెడెన్షియల్స్‌ను ఊహించిందని చెప్పారు.
మొత్తం మూడు సార్లు ఇలా జరిగిందని, ప్రతిసారీ హ్యాక్‌ను పూర్తి చేయడానికి ముందే, అది నిజమైన కంపెనీ అని గుర్తించి ఆ మోడల్ తనకు తానుగా ఆగిపోయిందని గూగుల్ స్పష్టం చేసింది.
జులై చివర్లోనే ఇర్రెగ్యులర్ ఈ హ్యాక్‌ల గురించి గూగుల్‌కు సమాచారం ఇచ్చింది. అయితే ఇది మోడల్ లోపం కాదని గూగుల్ వాదిస్తోంది. జెమినిలోని భద్రతా చర్యలు ఉద్దేశించిన విధంగానే పనిచేశాయని, అందువల్లే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం లేదని భావించామని గూగుల్ పేర్కొంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు: గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. మెటా, ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ మోడళ్లతో ఇర్రెగ్యులర్ సంస్థ నిర్వహించిన పరీక్షల సమయంలో అవి తమ పరిధిని దాటి ప్రవర్తించిన సందర్భాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో AI సైబర్ భద్రతా పరీక్షలను మరింత సురక్షితంగా నిర్వహించే మార్గాలపై పనిచేస్తున్నట్లు ఇర్రెగ్యులర్ పేర్కొంది.
ఇదిలా ఉండగా, జెమినీతో పోలిస్తే, వాస్తవ ప్రపంచ కంపెనీలతో వ్యవహరించేటప్పుడు ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ మోడల్ తనను తాను నియంత్రించుకోలేకపోయింది. ఆంత్రోపిక్ ఇటీవల నాలుగో AI హ్యాకింగ్ ఘటనను వెల్లడించింది. అంతకుముందు పరీక్షల సమయంలో తమ మోడళ్లు అనుచితంగా ఇంటర్నెట్ను యాక్సెస్ చేశాయని, నియంత్రణ తప్పాయని ఓపెన్ఏఐ కూడా నివేదించింది.








