E-PAPER

రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారు. – మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 17:
నిజాం పాలనలోని దొరల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని మాజీ డీసీసీబీ చైర్మన్, సీపీఎం సీనియర్ నాయకుడు యలమంచి రవికుమార్ అన్నారు.

దుమ్ముగూడెం మండలం ములకపాడు సెంటర్‌లోని యలమంచి సీతారామయ్య భవన్‌లో గురువారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు.

నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడంలో రైతాంగ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 17 చారిత్రక నేపథ్యాన్ని కొన్ని రాజకీయ శక్తులు వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మతపరమైన రంగు పులమడం సరికాదని రవికుమార్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పక్షాలు తమ దృక్పథాలకు అనుగుణంగా విలీనం దినం, విమోచన దినం, నవాబు లొంగిపోయిన దినంగా పేర్కొంటున్నాయని తెలిపారు.

అయితే ఆ రోజున హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో నిజాం పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిన అంశం చారిత్రక వాస్తవమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను విస్మరించకూడదని అన్నారు.

రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4 వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది గ్రామాల్లో భూవిభజన జరిగిందని రవికుమార్ పేర్కొన్నారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన ఈ పోరాటం ప్రజా ఉద్యమ చరిత్రలో కీలకమైనదని అన్నారు.

ఆనాటి అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా అడవుల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆదివాసీలకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 ప్రకారం హక్కు పత్రాలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్స చిలకమ్మ, సరియం కోటేశ్వరరావు, వై. శ్రీనుబాబు, కొమరం చంటి, మహమ్మద్ బేగ్, కాక కృష్ణ, సర్పంచులు కొర్స లింగరాజు, కొమరం శాంత, తెల్లం ధర్మయ్య, కృష్ణమూర్తి, నాగరాజు, గట్టుపల్లి వెంకటేశ్వర్లు, సీతారామయ్య, తుర్రం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!