E-PAPER

మనుషుల్లా ఆలోచించే ఏఐ వచ్చేసిందా..? ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన..

ఓపెన్‌ఏఐ నుంచి మరో సంచలన ఏఐ మోడల్‌ వచ్చింది. కొన్ని వారాలుగా ‘అస్త్ర’పై భారీ అంచనాలు పెంచిన సంస్థ.. తాజాగా జీపీటీ-6 ‘అస్త్ర’ను విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు తాము తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌ అని ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ప్రపంచంలోనే కంప్యూటర్‌ వినియోగం, ప్రొఫెషనల్‌ పనులు, సైన్స్‌, కోడింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో అత్యుత్తమ మోడల్‌ ఇదేనని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.

‘అస్త్ర’ విడుదలతో కొత్త తరం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని ఆల్ట్‌మన్‌ అన్నారు. ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ అయితే మరో అడుగు ముందుకేశారు. ప్రస్తుతం మనం ఏజీఐ యుగంలోకి ప్రవేశించామని భావించడం అసంబద్ధం కాదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ చరిత్రను తిరిగి చూసినప్పుడు ‘అస్త్ర’ విడుదల కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందన్నారు.

కోడింగ్‌లో ‘అస్త్ర’ పనితీరు ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఓపెన్‌ఏఐ పరీక్షల ప్రకారం జీపీటీ-5.6 Solతో పాటు ఆంథ్రోపిక్‌ ఫేబుల్‌ మోడళ్లను కూడా ఇది పలు పరీక్షల్లో అధిగమించింది. ఫ్రాంటియర్‌ మ్యాథ్‌ టైర్‌ 4లో 98 శాతం, ఏఆర్‌సీ-ఏజీఐ 3లో 99.9 శాతం స్కోర్‌ సాధించింది. టెర్మినల్‌-బెంచ్‌ 4.0లో 57.9 శాతం స్కోర్‌ చేసింది. ఇదే పరీక్షలో జీపీటీ-5.6 Sol 37.3 శాతం, క్లాడ్‌ ఫేబుల్‌ 5.1 55.8 శాతం సాధించాయి.

‘అస్త్ర’ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే పరిమితం కాదు. ఆన్‌లైన్‌ ఫారాలు నింపడం, క్యాలెండర్‌ ప్రకారం షెడ్యూల్‌ నిర్వహణ, రీసెర్చ్‌ చేయడం, శాస్త్రీయ డేటాను విశ్లేషించడం, వెబ్‌సైట్లు తయారు చేయడం, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసి పరీక్షించడం వంటి పనులు చేయగలదు. బ్లెండర్‌లో 3డీ మోడళ్లను తయారు చేయడం, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడం కూడా స్వయంగా చేయగలదని ఓపెన్‌ఏఐ చూపించింది. చట్టపరమైన పత్రాలు, ట్యాక్స్‌ రిటర్న్‌ల తయారీలోనూ దీన్ని ఉపయోగించొచ్చు.

సైబర్‌ సెక్యూరిటీ విషయంలోనూ ‘అస్త్ర’ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఉత్పత్తి స్థాయి భద్రతా పరిమితులు లేకుండా చేసిన పరీక్షల్లో ఎక్స్‌ప్లాయిట్‌బెంచ్‌పై 100 శాతం స్కోర్‌ సాధించింది. జీపీటీ-5.6 Sol 78.5 శాతం స్కోర్‌ చేసింది. అయితే ఇలాంటి సామర్థ్యాలతో భద్రతాపరమైన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో ‘అస్త్ర’పై మరిన్ని నియంత్రణలు పెట్టినట్లు సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ‘అస్త్ర’ను డేబ్రేక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌ వినియోగదారులకు అందిస్తున్నారు. వచ్చే వారం నుంచి చెల్లింపు చాట్‌జీపీటీ ప్లాన్లకు దశలవారీగా అందుబాటులోకి రానుంది. ఓపెన్‌ఏఐ ఏపీఐ, ఏడబ్ల్యూఎస్‌, అమెజాన్‌ బెడ్‌రాక్‌లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. విడుదల ఆలస్యమైనందుకు సామ్‌ ఆల్ట్‌మన్‌ క్షమాపణలు చెప్పారు. మొదట ప్రో యూజర్లతో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!