కరకగూడెం, సెప్టెంబర్ 1 (Y7 తెలుగు న్యూస్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత 1000 రోజులలో రైతులు, మహిళలు, యువత, పేదలు, వృద్ధులు, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలిచిందన్నారు. అలాగే అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, రేషన్‌లో సన్న బియ్యం పంపిణీ ద్వారా ఆహార భద్రతను కల్పిస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ నిర్మాణ సహాయం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ నియామకాలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.
“3500 రోజుల పాలనలో సాధ్యం కాని అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులలో ప్రారంభించింది. ఇది కేవలం పాలన కాదు, తెలంగాణ అభివృద్ధికి వెయ్యి రోజుల మైలురాయి” అని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.
“ఇది దొరల పాలన కాదు… ప్రజల పాలన. ఇది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పోలేబోయిన సుజాత, ఎర్రం పొట్టయ్య, బాడిష పార్వతి, ఉప సర్పంచ్ పూజారి వెంకన్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడి శ్రీను, మాజీ ఎంపీటీసీ బిజ్జా రామనాథం, మాజీ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్








