శ్రీకాకుళం జిల్లా పలాస వై7 న్యూస్
నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన అవగాహన సదస్సులో పలాస ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించే కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మరణానంతరం కళ్లను దానం చేయడం ద్వారా దృష్టిని కోల్పోయిన వారికి కొత్త వెలుగును అందించవచ్చన్నారు. కంటి దానం అత్యంత గొప్ప మానవతా సేవ అని, మనం ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం ముందుగానే నేత్రదానం చేయాలనే నిర్ణయం తీసుకుని, తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. నేత్రదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, సరైన అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కంటి దానం వల్ల మరణించిన వ్యక్తి ముఖ సౌందర్యానికి ఎలాంటి హాని కలగదని, యువత, విద్యార్థులు, సామాజిక సంస్థలు నేత్రదానంపై అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
“మరణం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగుగా నిలవడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ, CHC సూపరింటెండెంట్ టి. పాపినాయుడు, DCHS విజయలక్ష్మి, AMC చైర్మన్ మల్ల శ్రీనివాస్, HDS సభ్యులు సవర రాంబాబు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ దడియాల నరసింహా, గురుటి సూర్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
“నేత్రదానం చేద్దాం… మరొకరి జీవితంలో వెలుగులు నింపుదాం” అని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.








