E-PAPER

విద్యా సమస్యల పరిష్కారానికి జూలై 13న కలెక్టరేట్ ముట్టడి – ఏఐఎస్ఎఫ్ పిలుపు

శ్రీకాకుళం, జూలై 10 (వై7 న్యూస్): రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 13న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్‌లో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సుమారు రూ.10,700 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలకు సంబంధించిన తొమ్మిది క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.6,300 కోట్లు, స్కాలర్‌షిప్‌ల రూపంలో మరో రూ.2,200 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అవసరమైన నిధులు కేటాయించలేదని, అవసరానికి తగినంత నిధులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రయోజనాలకు దూరమవుతున్నారని, దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే విరమించుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా భావించి ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. తాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, పడక సామగ్రి, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్లు, కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, జూలై 13న నిర్వహించే కలెక్టరేట్ మహాధర్నాలో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అశోక్, హర్షవర్ధన్, ఉదయ్, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News