E-PAPER

ఇంటర్ సైన్స్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రాక్టికల్స్ విధానంలో కీలక మార్పులు చేసిన టీజీబీఐఈ

 

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ఫస్టియర్ సైన్స్ విద్యార్థులకు కూడా 15 మార్కుల ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. సెకండియర్ విద్యార్థులకు కూడా ఇదే విధానం కొనసాగుతుండగా, థియరీ పరీక్షలు యథావిధిగా 60 మార్కులకు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలు రెండింటినీ బాహ్య పరీక్షలుగానే నిర్వహించనున్నారు.

ఈ మార్పులకు అనుగుణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల ల్యాబ్ మాన్యువల్స్‌ను టీజీబీఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ల్యాబ్ మాన్యువల్స్‌లో ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, నెలవారీ షెడ్యూల్‌ను పొందుపరిచారు. ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్ష గంటన్నర పాటు నిర్వహించనుండగా, పరీక్ష అనంతరం మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ప్రిన్సిపాల్ లేదా లెక్చరర్ ధృవీకరించిన ప్రాక్టికల్ రికార్డు పుస్తకాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం కళాశాలలు అవసరమైన పరికరాలు, రసాయనాలు, మైక్రోస్కోపులు సిద్ధంగా ఉంచడంతో పాటు ల్యాబ్ భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని బోర్డు ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినా సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రాక్టికల్ తరగతులు, పరీక్షల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లదేనని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News