జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. మరోవైపు పెద్దగా ప్రభావం చూపని కొందరు ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ సీజన్‌లో 501 పరుగులు చేసి 41.75 సగటు, 192.69 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే 42 సిక్సర్లు బాది తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందినా భారత జట్టులో చోటు దక్కలేదు. ఇదే విధంగా సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచినా ఎంపిక కాలేదు.
యువ పేసర్ రసిఖ్ సలామ్ కూడా ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 21.32 సగటు, 9.46 ఎకానమీతో రాణించినప్పటికీ జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోవడం అభిమానుల్లో అసంతృప్తికి కారణమైంది. మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను పక్కనపెట్టి జట్టు ఎంపిక చేశారంటూ సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పలువురు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.








