
అశ్వాపురం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో విగ్రహాల రాజకీయాలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. గత 30 ఏళ్లుగా స్థానికంగా “టీడీపీ సెంటర్”గా గుర్తింపు పొందిన కూడలి, ఇటీవల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో “అంబేద్కర్ సెంటర్”గా నామకరణం కావడం కొత్త వివాదాలకు తెరలేపింది.
అంబేద్కర్ సెంటర్‌గా పేరు మారడంతో తమ రాజకీయ, సామాజిక ఉనికి తగ్గిపోతుందనే భావనతో ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
ఒకవైపు “అంబేద్కర్ సెంటర్” అని బోర్డులు, మరోవైపు “టీడీపీ సెంటర్” అంటూ పిలుపులు వినిపించడంతో ప్రజలు సైతం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. “ఇది మహనీయుల ఇచ్చే గౌరవమా..? లేక ఆధిపత్య రాజకీయాలా..?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతలోనే బీసీ సంఘం నాయకులు జగదాంబ స్వీట్స్ సెంటర్ వద్ద దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఇక ఆదివాసి సంఘాలు కూడా తమ ఆరాధ్య నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయనే సమాచారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. మరోవైపు మరికొన్ని సంఘాలు కూడా తమ మహనీయుల విగ్రహాలు పెడతామని సోషల్ మీడియాలో సంకేతాలు ఇవ్వడంతో అశ్వాపురం మొత్తం “విగ్రహాల రాజకీయాల కేంద్రం”గా మారిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్లపైనే రాత్రికి రాత్రి విగ్రహాలు వెలుస్తుండటం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. 1961 హైవేస్ యాక్ట్ ప్రకారం రహదారి పరిధిలో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ, డివైడర్ ల మీద రాత్రికి రాత్రే వరుసగా విగ్రహాలు వెలుస్తుండటం అధికారుల వైఖరిపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
అధికారులు తెలుపుతున్న యాక్ట్ ప్రకారం 1961 తరువాత ఏర్పాటు చేసిన అనుమతి లేని విగ్రహాలను తీసివేసిన తరువాతనే మా విగ్రహాల జోలికి రావాలి అప్పటి వరకు మా విగ్రహాల జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ కొన్ని సంఘాల నేతలు బహిరంగ హెచ్చరికలు చేయడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. ఓట్ల రాజకీయాల కోసం ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారా..? లేక చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేస్తారా..? అన్నది ఇప్పుడు అశ్వాపురంలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజలను చైతన్యపరిచే మహనీయుల విగ్రహాలు ఇప్పుడు వర్గ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలకు వేదికవుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి నియంత్రణ చర్యలు తీసుకుంటారా..? లేక విగ్రహాల సెగ ఇంకా ముదురుతుందా..? అన్నది వేచి చూడాలి.








