E-PAPER

గ్యాస్ అక్రమ మార్పిడి గుట్టు రట్టు

వై7 న్యూస్ ఖమ్మం

ముగ్గురిపై కేసు – ఒకరు అరెస్ట్, భారీగా సిలిండర్లు స్వాధీనం
ఖమ్మం నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య సిలిండర్లకు అక్రమంగా మార్పిడి చేస్తున్న ఘటనను అర్బన్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ తెలిపారు.
విశ్వసనీయ సమాచారంతో గురువారం అర్బన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గురుదత్త ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన డెలివరీ సిబ్బంది గృహ వినియోగ సిలిండర్ల నుండి వాణిజ్య సిలిండర్లకు, అలాగే ఇతర గృహ సిలిండర్లకు అక్రమంగా గ్యాస్ నింపుతున్నట్లు గుర్తించారు.
దాడుల్లో భాగంగా పోలీసులు భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 160 ఇండేన్ గ్యాస్ సిలిండర్లు, 14 హెచ్‌పి గ్యాస్ సిలిండర్లు, 5 ట్రాలీ ఆటోలు, ఒక అశోక్ లేలాండ్ లారీ, రెండు తూకం యంత్రాలు, ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనలో పాలుపంచుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేయగా, ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
రిపోర్ట్: పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!