E-PAPER

సీజేఐపై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు.. భద్రతా సిబ్బందితో బయటకు పంపిన సుప్రీంకోర్టు..

సుప్రీంకోర్టులో  ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌పై ఓ న్యాయవాది వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘ఆ కుర్చీలో కూర్చోవడానికి మీరు అనర్హులు, మీకు ఆ అర్హత లేదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, భద్రతా సిబ్బంది ఆయనను కోర్టు హాల్ నుంచి బలవంతంగా బయటకు పంపారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించగానే ఈ ఘటన జరిగింది. ఓ న్యాయవాది తన కేసును తక్షణమే విచారించాలని కోరారు. న్యాయవ్యవస్థలోని అవినీతికి సంబంధించిన అంశాలు లేదా తనపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి నవంబర్ 2న సీజేఐ కార్యాలయంలో పత్రాలు సమర్పించినప్పటికీ, 15 రోజులుగా ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో జస్టిస్ మోహన జోక్యం చేసుకుని, ఇలాంటి విషయాలను ఈ పద్ధతిలో ప్రస్తావించకూడదని సూచించారు. దీనిపై ధర్మాసనం పరిశీలిస్తుందని, వేచి ఉండాలని సీజేఐ సూచించినప్పటికీ ఆ న్యాయవాది నిరాకరించారు. “నేను వేచి ఉండను.. ఆ కుర్చీలో కూర్చోవడానికి మీకు అర్హత లేదు” అంటూ సీజేఐని ఉద్దేశించి నేరుగా వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని ఇతర ఇద్దరు న్యాయమూర్తులపై తనకు గౌరవం ఉందని చెబుతూనే, సీజేఐపై ఆరోపణలు కొనసాగించారు.

ఈ వ్యాఖ్యల వెంటనే కోర్టు కార్యకలాపాల ఆడియో, వీడియో ప్రసారాలను నిలిపివేశారు. భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై అక్కడున్న బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు న్యాయవాది ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. తనపై ఉన్న ఓ కోర్టు ధిక్కరణ కేసు విషయంలో అసహనంతోనే సదరు న్యాయవాది ఈ విధంగా ప్రవర్తించినట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!