E-PAPER

పొదెం వీరయ్య ప్రతిష్ఠను దెబ్బతీసే కథనాలు సరికావు: వాసిరెడ్డి సాంబశివరావు

భద్రాచలం, సెప్టెంబర్ 28 (Y7 News): మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొదెం వీరయ్యపై ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న కథనాలు నిరాధారమని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి సాంబశివరావు పేర్కొన్నారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పొదెం వీరయ్య సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, గాంధీ కుటుంబ రాజకీయ భావజాలానికి కట్టుబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు.

పొదెం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని, ములుగు నియోజకవర్గం నుంచి రెండుసార్లు, భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని సాంబశివరావు గుర్తుచేశారు. ముఖ్యంగా 2018–2023 మధ్య కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని కాపాడేందుకు కృషి చేశారని తెలిపారు.

వీరయ్య రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను పక్కనపెట్టి ఊహాగానాలు, నిర్ధారణ లేని అంశాల ఆధారంగా కథనాలు ప్రచురించడం సరైన జర్నలిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికే వీరయ్య ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తదితరులు ప్రతిపాదించిన ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ విలువల పట్ల వీరయ్యకు ఉన్న నిబద్ధతను ప్రశ్నించే ముందు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా పరిశీలించాలని సాంబశివరావు సూచించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురించడం మానుకోవాలని, నిరాధార ప్రచారాలను ప్రజలు నమ్మకుండా నిజానిజాలు పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!